పెట్టుబడిదారీ సంక్షోభంపై పెరుగుతున్న ఆగ్రహం
ఈ సదస్సుకు హాజరు కావడానికి బయల్దేరి వెళ్లేముందు ప్రధాని భారత ఆర్థిక వ్యవస్థ మేనేజర్లు, సలహాదారులతో ఉన్నత స్థాయీ సంప్రదింపులు జరిపారు. భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న అధిక ద్రవ్యోల్బణం, వేగంగా పడిపోతున్న పారిశ్రామికాభివృద్ధి అనే జంట సమస్యల గురించి ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి అభివృద్ధి చెందిన దేశాలకు ఇచ్చిన పిలుపు, భారత ఆర్థిక వ్యవస్థకు ఇస్తున్న చిట్కాలు నయా ఉదారవాద ఆర్థిక సంస్కరణల పరిధిలోనే పరిష్కారాల కోసం యుపిఎ-2 ప్రభుత్వం అన్వేషిస్తోందని స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిష్కారారాలు భారత దేశ ప్రజల జీవనాలను మరింత దిగజారుస్తాయి.
ప్రపంచ దేశాలకు చెందిన అనేక మంది నాయకుల మాదిరిగా భారత ప్రధాని కూడా ప్రపంచీకరణకు వ్యతిరేకంగా వాల్‌స్ట్రీట్‌లో విస్తరిస్తున్న ప్రదర్శనలను విస్మరిస్తున్నట్లు ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలు స్పష్టం చేస్తున్నాయి. ఆస్ట్రేలియా నుండి ఆసియా, యూరప్, అమెరికాల్లో ప్రదర్శనలు జరిగాయి. ప్రపంచవ్యాప్త కార్యాచరణలో భాగంగా 82 దేశాల్లో 1,500కుపైగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. న్యూయార్క్‌లోని మన్‌హటన్ ఆర్థిక జిల్లాలోని లిబర్టీ స్క్వేర్ వద్ద 2011 సెప్టెంబర్ 17న ప్రారంభమైన ముట్టడి ప్రస్తుతం అమెరికాలోని 100కుపైగా నగరాలకు విస్తరించింది. ప్రపంచాన్ని మరోసారి మాంద్యంలోకి నెట్టివేసే ప్రస్తుత పెట్టుబడిదారీ సంక్షోభానికి కారణమైన కార్పొరేట్ శక్తుల మితిమీరిన స్వార్ధానికి నిరసనగా ఈ ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఒకవైపు బోస్టన్‌లో బ్యాంక్ ఆఫ్ అమెరికా భవనానికి వెలుపల గుమికూడిన ప్రదర్శకులు వర్గ పోరాటాన్ని ప్రారంభించగా ఈ ప్రదర్శనలు వర్గపోరాటం స్థాయికి చేరుకోవచ్చుననే ఆందోళనను రిపబ్లికన్ పార్టీ వ్యక్తం చేసింది.
ప్రపంచవ్యాప్తంగా మాంద్యం ప్రారంభమైన తరువాత కార్ల్ మార్క్స్ దాస్ క్యాపిటల్ పుస్తకం అమ్మకాలు జోరందుకున్నట్లు సమాచారం. పోప్ కూడా వాటికన్ సిటీకి కొన్ని కాపీల కోసం ఆర్డర్ ఇచ్చారని వార్తలు సూచిస్తున్నాయి. వియత్నాం యుద్ధానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరుగుతున్న సమయంలో బోస్టన్ నగరంలోని యూనివర్శిటీ ప్రాంగణంలో ''గ్రేడ్ సంపాదించాలంటే, మార్క్స్ సిద్ధాంతాల పట్ల మంచి అవగాహన కలిగి ఉండాలని సూచిస్తూ కొన్ని పోస్టర్లు వెలిశాయి. పెట్టుబడిదారీ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందో, సంక్షోభాలకు మూలమేమిటి అన్న అంశాలపై అవగాహన ఏర్పరచుకోగోరే వ్యక్తులు దాస్ కాపిటల్ పుస్తకం మొదటి సంపుటిలోని చివరి అధ్యాయం చదవడం మంచిది. ''పెట్టుబడి తల నుండి పాదాల వరకు ప్రతి చిన్న బెజ్జం నుండి రక్తం, ధూళితో జాలువారుతూనే ఉంటుంది.''. టి జె డన్నింగ్ అనే ఒక కార్మికుడు రాసిన ఫుట్‌నోట్‌తో మార్క్స్ దీనిపై ఈ పెట్టుబడి స్వభావం గురించి ఇలా వర్ణించాడు. ''తగిన లాభం ఉంటే పెట్టుబడి సాహసోపేతంగా వ్యవహరిస్తుంది. పది శాతం లాభం కచ్చితంగా వస్తుందంటే అది ఎక్కడికైనా పరుగులు తీస్తుంది. 20 శాతం లాభం వస్తుందంటే తహతహలాడుతుంది. 50 శాతం లాభం వస్తుందనుకుంటే ఒకింత తెంపరితనాన్ని ప్రదర్శిస్తుంది.నూటికి నూరు శాతం లాభం వస్తుందంటే అన్ని రకాల మానవ చట్టాలను అతిక్రమించడానికి సిద్ధమవుతుంది. 300 శాతం లాభం వస్తుందంటే అది ఏ అఘాయిత్యానికైనా వెనకాడదు. చివరికి యజమానికి ఉరిశిక్ష పడుతుందనుకున్నా లెక్కచేయదు.''. ఏదిఏమైనా వీలైనంత ఎక్కువగా లాభాలను సంపాదించాలనే పెట్టుబడిదారీ వ్యవస్థ అంతర్గత లక్షణమే ప్రస్తుత సంక్షోభానికి అసలు కారణం. కొంతమంది వక్తుల స్వార్థం, నియంత్రణ వ్యవస్థల వైఫల్యం వల్ల ఈ సంక్షోభం తలెత్తలేదు.
లాభం ఎక్కువగా సంపాదించాలని కోరుకోవడం అత్యంత సహజం. ఇది పెట్టుబడిదారీ వ్యవస్థ ముఖ్య లక్షణం. పెట్టుబడిదారీ వ్యవస్థకు, దురాశకు మధ్య సంబంధం లేదని, దానిని నియంత్రించవచ్చునని చెప్పడం పూర్తిగా సత్యదూరం పెట్టుబడిదారీ వ్యవస్థకు, దురాశకు మధ్య విడదీయరాని సంబంధం ఉంటుంది. వ్యవస్థలోనే దోషం ఉంది కానీ పెట్టుబడిదారుల ఆలోచనల్లో, ఆకాంక్షాల్లో లేదు. పెట్టుబడిదారీ దేశంలో నిరపాయకరమైన తటస్థ వ్యవస్థ ఉంటుందనే ప్రచారంలో కూడా నిజం లేదు. దాని సహజ లక్షణానికి అనుగుణంగా ఈ సంక్షోభానికి మొదటగా అసలు కారణమైన బడా పెట్టుబడిదారులకు పెట్టుబడిదారీ ప్రభుత్వం ఉద్దీపన పథకాలను ప్రకటించింది. అమెరికా ప్రభుత్వ ఉద్దీపన పథకాల గురించి ప్రత్యేక ఇన్‌స్పెక్టర్ జనరల్ ఈ విధంగా పేర్కొన్నారు. ''2007లో ఆర్థిక సంక్షోభం ప్రారంభమైనప్పటి నుండి ఫెడరల్ ప్రభుత్వం అనేక ఏజెన్సీల ద్వారా ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇచ్చేందుకు అనేక కార్యక్రమాలను అమలు చేసింది. ఫెడరల్ ప్రభుత్వం ఇలా సహాయమందించే మొత్తం సామర్ధ్యం 23.7 ట్రిలియన్ డాలర్లకు చేరవచ్చు''. అని ఆయన పేర్కొన్నారు. 14 ట్రిలియన్ డాలర్లు మాత్రమే ఉన్న అమెరికా జిడిపితో ఈ మొత్తాన్ని పోల్చి చూడండి. అమెరికా ఆర్థిక శాఖ ప్రతినిధి ఈ గణాంకాలు నిజం కావని పేర్కొన్నారు. అదేవిధంగా అనేక అభివృద్ధి చెందిన దేశాల ప్రభుత్వాలు ఇటువంటి ఉద్దీపన పథకాలను అమలు చేసేందుకు పెద్ద ఎత్తున రుణాలు చేశాయి. కార్పొరేట్ దివాళాలు ఆ విధంగా ప్రభుత్వ దివాళాలుగా రూపాంతరం చెందాయి. గ్రీస్ ఆర్థిక వ్యవస్థ మొత్తంగా కుప్పకూలిపోయింది. స్పెయిన్ అదే బాటలో నడిచేందుకు సిద్ధంగా ఉంది. రుణ భారం మోయలేక యూరోపియన్ యూనియన్ తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. యూరోపియన్ దేశాలు అత్యంత కఠినమైన పొదుపు చర్యలను అమలుచేస్తూ సామాన్య ప్రజల జీవితాలను దుర్భరం చేస్తున్నాయి. వాటి ఉద్దేశంలో పొదుపు చర్యలంటే మరేమీ కాదు, సామాజిక ప్రయోజనాలపై, కార్మికుల కోసం పెట్టే వ్యయంపై కోత విధించడమే. దీంతో సార్వత్రిక సమ్మెలు, నిరసన ప్రదర్శనలు సర్వసాధారణమయ్యాయి.
సంక్షోభం ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. అమెరికాలోని ప్రతి ఆరుగురు పౌరుల్లో ఒకరు పేదరికంలో మగ్గుతున్నారని కొత్త జనగణన సమాచారం వెల్లడించింది. వరుసగా మూడో సంవత్సరం సాధారణ కుటుంబీకుల ఆదాయం తగ్గింది. అధికార నిరుద్యోగ రేటు ప్రస్తుతం 9.1శాతం ఉంది. అంటే 1.4 కోట్ల మంది ఎటువంటి పని లేకుండా నిరుద్యోగులుగా ఉన్నారు. స్థూల పేదరిక రేటు 2009లో 14.3 శాతం ఉండగా 2010 నాటికి అది 15.1 శాతానికి, అంటే 4.62 కోట్లకు పెరిగింది. ఒక కుటుంబ వార్షిక ఆదాయం 22,300 డాలర్ల ప్రాతిపదికగా పేదరిక రేటును నిర్ణయిస్తారు. వాస్తవ మధ్యతరగతి కుటుంబాల ఆదాయం 2007తో పోలిస్తే 6.4 శాతం తగ్గి 49,945 డాలర్లకు చేరుకుంది. నల్లజాతి కుటుంబాల ఆదాయం 15 శాతం పడిపోయింది. ఆఫ్రికన్-అమెరికన్ ప్రజల నిరుద్యోగ రేటు ప్రస్తుతం 16.7 శాతం ఉంది. మాంద్యం ప్రభావాన్ని ప్రతిబింబించే విధంగా అమెరికా పేదరిక రేటు తీవ్ర ఇంధన సంక్షోభం, నయా ఉదారవాద విధానాలను అనుసరించి ప్రభుత్వ వ్యయాలపై కోత విధించిన కారణంగా ద్రవ్యోల్బణం పెరగడంతో వడ్డీ రేట్లు, నిరుద్యోగం పెరిగిన 1980ల్లోని ఏ మూడు సంవత్సరాల కాలం కంటే 2007-10 సంవత్సరాల మధ్య వేగంగా పెరిగింది. పేదరికంలో మగ్గుతున్న పేదల సంఖ్య 4.6 కోట్లు. 1959లో జనగణన ప్రారంభమైన తరువాత ఇంత అత్యధికంగా ఎన్నడూ లేదు. 1983 తరువాత 19993 ప్రాతిపదికగా నిరుపేదలుగా ఉన్న శాతంతో పోలిస్తే ప్రస్తుతం గణనీయంగా పెరిగింది. దేశంలో అగ్రస్థానంలో ఉన్న ఒక శాతం వర్గం ఆదాయంలో పొందుతున్న వాటా సుమారు 20 శాతం ఉంది. ఇది 1970ల్లో సుమారు ఎనిమిది శాతం ఉంది.
ప్యూ రీసెర్చ్ కేంద్రం విశ్లేషించిన అమెరికా కొత్త జనగణన వివరాల ప్రకారం ఆర్థిక మాంద్యం అమెరికా ప్రజల సంపదపై తీవ్ర ప్రభావం చూపింది. అయితే ఇందులో శ్వేతజాతీయులు కోల్పోయింది అత్యంత స్వల్పం.2005-2009 మధ్య హిస్పానిక్ కుటుంబీకుల ఆదాయం 66 శాతం తగ్గింది. నల్లజాతి కుటుంబీకుల ఆదాయం 53 శాతం తగ్గింది. అయితే శ్వేతజాతీయుల కుటుంబాల ఆదాయం 16 శాతం తగ్గింది. శ్వేత జాతి కుటుంబీకుల ఆదాయం నల్లజాతి కుటుంబీకుల ఆదాయం కంటే 20 రెట్లు, హిస్పానిక్ కుటుంబీకుల ఆదాయం కంటే 18 రెట్లు ఎక్కువగా ఉంది. ఈ తేడా మాంద్యం ముందున్న అంతరం కంటే రెండు రెట్లు ఉంది. 1984లో సమాచారం సేకరించడం ప్రారంభించాక అత్యధిక మొత్తంలో ఉంది. ఆసియన్ అమెరికన్ కుటుంబీకుల సంపద కూడా మాంద్యం దెబ్బకు కుదేలైంది. 2005లో సగటు ఆదాయంతో పోలిస్తే 2009లో బాగా తక్కువగా ఉంది. ఇది సగటున 54 శాతం తగ్గింది. 2005-2009 మధ్య అత్యంత సంపన్నవంతులైన 10 శాతం కుటుంబీకులకు దేశ సంపదలో వాటా 49 నుండి 56 శాతానికి పెరిగింది. ప్రత్యేకంగా ఎటువంటి ఆస్తులు లేని అమెరికా ప్రజల సంఖ్య బాగా పెరిగింది. హిస్పానిక్స్‌లో మూడవ వంతు మంది ఆదాయ వాటా 2005లో 23 ఉండగా 2009 నాటికి సున్నా శాతానికి చేరుకుంది. అదే సమయంలో ఆస్తులు లేని నల్లజాతీయుల సంఖ్య 29 నుండి 35 శాతానికి పెరిగింది. శ్వేత జాతీయుల సంఖ్య 11 నుండి 15 శాతానికి పెరిగింది. అమెరికాలో ప్రజల ఆదాయాల మధ్య తేడా పెరుగుతున్నట్లు అనేక సంవత్సరాల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 1930 నాటి మహా మాంద్యం తరువాత ఇంతటి తీవ్ర స్థాయిలో అంతరాలు ఎన్నడూ లేవు.
మరోవైపు సంక్షోభం ప్రారంభమైన వాల్‌స్ట్రీట్‌లో అపర కుబేరుల పరిస్థితి ఏమిటి? దివాళా తీసిన సంస్థగా గుర్తింపు పొందిన బ్యాంక్ ఆఫ్ ఆమెరికా 2011 ప్రధమార్ధంలో 3.7 బిలియన్ డాలర్ల ఆదాయం సంపాదించింది. గోల్డ్‌మాన్ సచ్ తన ఎగ్జిక్యూటివ్‌లకు 5.23 బిలియన్ల డాలర్ల బోనస్ చెల్లించింది. అదనపు నికర ఆదాయాలు 11.89 బిలియన్లుగా నమోదయ్యాయి. ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో 2.7 బిలియన్ డాలర్ల నికర ఆదాయాన్ని ఆర్జించింది.
ఈ పరిస్థితుల్లో పైన పేర్కొన అంశాలపై ప్రధాని ఆ విధంగా ఆందోళన చెందడం సహజమే. కానీ, భారతదేశంలో ఉన్న మనకు ఆయన చూపిస్తున్న పరిష్కాలేమిటి? ద్రవ్యోల్బణం సెప్టెంబరులో 9.72 శాతానికి, ఆహార ద్రవ్యోల్బణం తాజాగా 10.6 శాతానికి చేరుకున్నాయి. ఇంధనం, వినిమయ వస్తువుల ధరలు చుక్కలనంటుతున్నాయి. మరో వైపు పారిశ్రామిక ఉత్పత్తి సూచి 4.1శాతానికి పడిపోయింది. ప్రపంచ ఆర్థిక మాంద్యం దెబ్బకు జులై-సెప్టెంబరు మధ్య మన ఎగుమతులు 82 శాతం నుండి 36 శాతానికి పడిపోయాయి. దేశీయంగా డిమాండ్ మందగించడంతో దిగుమతులూ తగ్గుముఖం పట్టాయి. దీంతో మన వాణిజ్యలోటు అసాధారణ స్థాయిలో రు.3,67,500కోట్లు (7,.350 కోట్ల డాలర్లు)కు చేరుకుంది. ద్రవ్యోల్బణం అదుపునకు ఆర్‌బిఐ చేపట్టిన చర్యలతో రుణాలు అందుబాటులో లేకుండా పోతున్నాయి. ఇది పెట్టుబడుల క్షీణతకు దారితీస్తుందని పెట్టుబడిదారులు ఆక్షేపిస్తున్నారు. వారు చెబుతున్న దాని ప్రకారం పెట్టుబడి వ్యయం ఎంత తక్కువగా ఉంటే పెట్టుబడులు అంత ఎక్కువగా పెరుగుతాయి. అప్పుడది అధిక వృద్ధిరేటుకు తోడ్పడుతుంది. ఆహా! ఏమి సూత్రీకరణ. ఇంతకన్నా తప్పుడు భావన మరొకటి ఉండదు. ప్రజల చేతిలో కొనుగోలు శక్తి పెరగకుండా అధికోత్పత్తి సాధించి ప్రయోజనమేమిటి? అధిక పెట్టుబడులు పెట్టి సాధించిన ఉత్పత్తిని అమ్ముకోవాలంటే ప్రజల చేతిలో కొనుగోలు శక్తి ఉండాలి కదా. ప్రపంచ వ్యాపితంగాను, మన దేశంలోనూ ఇప్పుడదే కొరవడింది. నయా ఉదారవాద విధానాల చిట్కాలు వికటించాయి. స్పెక్యులేటివ్ లాభాలను ఇబ్బడిముబ్బడిగా పెంచుకునేందుకే ఈ చౌక రుణాలు ఉపయోగపడతాయి. ప్రపంచ వ్యాపితంగా ఇటువంటి ధోరణే మనకు కనిపిస్తుంది. ఆర్థిక మాంద్యానికి ఏ ఫైనాన్షియల్ కార్పొరేట్లు అయితే కారణమయ్యారో ఆ కార్పొరేట్లే ఈ గడ్డు పరిస్థితుల్లో సైతం తమ చట్టా వ్యాపారాన్ని (స్పెక్యులేటివ్ ట్రేడింగ్) మొదటి త్రైమాసికం నుంచి మూడవ త్రైమాసికానికి డెరివేటివ్స్ రూపంలో 11.3 లక్షల కోట్ల డాలర్లకు మేరకు పెంచుకున్నాయి. ఈ మాంద్యానికి కారకులైన ప్రధాన నేరస్థులు జెపి మోర్గాన్ చేజ్, సిటీగ్రూప్, బ్యాంకు ఆఫ్ అమెరికా, గోల్డ్‌మన్ శాచ్సే. స్పెక్యులేటివ్ వ్యాపారంలో ఈ నాలుగు సంస్థల వాటాయే 90 శాతం దాకా ఉంది.
కీన్స్ చెప్పినట్లు ఇంత నగంగా భారీ లాభాలను జుర్రుకోకుండా కొంతమేరకైనా నియంత్రించేందుకు ప్రభుత్వ జోక్యం అనేది ఒక మార్గం. అంతర్గత వైరుధ్యాల మూలంగా సంక్షోభ వలయంలో కొట్టుమిట్టాడే పెట్టుబడిదారీ వ్యవస్థను కూలిపోకుండా నిలబెట్టడానికి ప్రజలకు కాసింత ఉపశమనం కలిగించేందుకే కీన్స్ సిద్ధాంతం తోడ్పడుతుంది. కీన్స్ సూచించిన ప్రభుత్వ జోక్యాన్ని నయా ఉదారవాద విధానాల కాలంలో ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టి కార్పొరేట్లను మేపడానికి ఉపయోగిస్తున్నారు. నేడు ఈ వ్యవస్థ ఇంతగా అస్థిరతకు గురికావడానికి ఇదొక ముఖ్య కారణం.
భారత దేశ విషయానికొస్తే మేము ఇంతకుముందు ఇదే కాలమ్‌లో పదే పదే పేర్కొన్నట్లు మన ఆర్థిక మూలాలు సుస్థిరంగా, పటిష్టంగా ఉండాలంటే మన ప్రజల చేతిలో కొనుగోలు శక్తిని పెంచేలా ప్రభుత్వ జోక్యం, పాత్ర ఉండేట్లు ప్రణాళికలు రూపొందించాలి. కొనుగోలు శక్తి పెరిగితే అది సుస్థిర అభివృద్ధికి దోహదపడుతుంది.
గత రెండు బడ్జెట్ల పత్రాలను పరిశీలిస్తే సంపన్నులకు రు.5లక్షల కోట్ల మేర పన్ను రాయితీలను ప్రభుత్వం ఇచ్చింది. ఈ ధోరణిని ప్రధాని, ఆయన సలహాదారులు మార్చుకోవాలి. ఈ డబ్బును నిధులకొరతతో సతమతమవుతున్న మౌలిక సదుపాయాలు వంటి పబ్లిక్ వర్కు ప్రాజెక్టుల్లో పెడితే అది పెద్దయెత్తున ఉపాధి పెరుగుదలకు, తద్వారా ప్రజల చేతిలో కొనుగోలు శక్తి పెరగడానికి ఉపయోగపడుతుంది. ఈ అవకాశం ఇప్పటికీ ఉంది. యుపిఏ-2 ప్రభుత్వం మెడలు వంచేందుకు ప్రజా ఉద్యమాలు, నిరసన కార్యక్రమాలను ఉధృతం చేయాలి.
No comments:
Post a Comment