అమర్త్య సేన
ఆర్థికాభివృద్ధి రేటును ఎవ్వరూ తీసిపారేయనవసరం లేదు. నేను కూడా ఎప్పుడూ ఆర్థికాభివృద్ధి ప్రాధాన్యతను తీసిపారేయలేదు. అయితే ఆర్థికాభివృద్ధి తనంతట తానే లక్ష్యంగా మారదు. మనం సాధించదల్చుకున్న విలువైన లక్ష్యాలను చేరుకోవటంలో అది సాధనంగా మారుతుంది. అటువంటి విలువైన లక్ష్యాల్లో జీవన ప్రమాణాల పెంపుదల ఒకటి.
ఈ మధ్య ఒక రోజు ఉదయాన్నే ఒక మిత్రుడు ఫోన్ చేశాడు. భారతదేశపు ఆర్థికాభి వృద్ధి గురించి జరుగుతున్న చర్చ చాలా ఆసక్తి కరంగా ఉందని చెప్పాడు. నావల్ల ఒకరు సంతో షపడ్డారన్న విషయం నాకు తృప్తి కలిగించింది. అయితే అతను దేని గురించి మాట్లాడుతున్నాడు అన్న విషయం మాత్రం నాకు అంతుబట్టలేదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో భారతదేశ ఆర్థికాభివృద్ధి గురించిన చర్చల్లో నేను జోక్యం చేసుకున్న సందర్భం నాకు గుర్తుకు రాలేదు. అయితే ఈ విషయం గురించి పదే పదే ఫోన్లు, మెయిల్‌లు రావటం మొదలైంది. నేను ఎప్పుడు మాట్లాడాను అన్న విషయం నాకు గుర్తుకు రాకపోవటంతో ఈ మధ్య కాలంలో నేను హాజరైన చర్చలన్నింటినీ నెమరువేసుకోవటం ప్రారంభించాను. ఢిల్లీలో గత సంవత్సరం డిశంబరులో ది ఇండస్ ఎంటర్‌ప్రైజెస్ అన్న సంస్థ నిర్వహించిన ఒక చర్చలో పాల్గంటూ నేను ఇతర రంగాలు, విద్య, వైద్యం, సగటు ఆయుష్షు కాలం వంటి విషయాలు పోల్చి చూడకుండా కేవలం స్థూల జాతీయోత్పత్తి విషయంలో భారతదేశం, చైనాల మధ్య పోలిక పెట్టి చూడటం పిల్ల చేష్ట అని వ్యాఖ్యానించాను. ఈ ఏకవాక్య విమర్శను అనేకమంది విభిన్న రీతిలో వ్యాఖ్యానిస్తున్నారు. అందువల్ల నా విమర్శ గురించి వివరించటం అవసరమని భావిస్తున్నాను.
ప్రజల జీవన ప్రమాణాలు పెంచటం లోనూ, పేదరికాన్ని తగ్గించటంలోనూ స్థూల జాతీయోత్పత్తి తన వంతు పాత్ర పోషిస్తుంద నటంలో సందేహం లేదు. అయితే స్థూల జాతీయోత్పత్తి గురించి చర్చించేటప్పుడు మనం తరచూ గందరగోళపడే అవకాశం ఉంది. ఆర్థికాభివృద్ధి మంచి విషయాలను సాధించ టానికి సాధనంగా ఉండాలన్న విషయానికీ, ఇటువంటి వృద్ధే ఒక లక్ష్యంగా మారటానికీ మధ్య ఉన్న గందరగోళం ఇది. ఆర్థికాభివృద్ధి రేటును ఎవ్వరూ తీసిపారేయనవసరం లేదు. నేను కూడా ఎప్పుడూ ఆర్థికాభివృద్ధి ప్రాధాన్యతను తీసిపారేయలేదు. అయితే ఆర్థికాభివృద్ధి తనంతట తానే లక్ష్యంగా మారదు. మనం సాధించదల్చుకున్న విలువైన లక్ష్యాలను చేరు కోవటంలో అది సాధనంగా మారుతుంది. అటువంటి విలువైన లక్ష్యాల్లో జీవన ప్రమాణాల పెంపుదల ఒకటి.
అదేసమయంలో నా వ్యాఖ్యతో చైనా, భారతదేశ ఆర్థిక వ్యవస్థల మధ్య పోలిక దీర్ఘ కాలంలో కూడా అవసరం లేదన్న అంచనాకు కూడా రావాల్సిన అవసరం లేదు. రెండు దేశాల అభివృద్ధి తీరుతెన్నులు పరిశీలించటానికి ఇది ఒక మంచి కోణం. గతంలో నేను చేపట్టిన అనేక పరిశోధనల్లో ఈ కోణాన్ని వినియో గించాను. జీన్ డ్రీజ్ పరిశోధనల్లో కూడా ఈ కోణం వినియోగంలో ఉంది. చారిత్రక ఆసక్తి రీత్యా చాలా కాలం నుండీ భారత్, చైనాలను పోల్చి చూడటం జరుగుతూ ఉంది. మధ్య యుగాల నాటి చైనా మేధావి వై జింగ్.... భారతదేశంలో ఏమూలనైనా చైనాను మెచ్చుకోని వాళ్లు ఉన్నారా?.... అని ప్రశ్నించాడు. ఏడవ శతాబ్దానికిచెందినవాడుగా భావించబడుతున్న ఈ మేధావి పదేళ్ల పాటు భారతదేశంలో గడిపిన తర్వాత చైనా చేరిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశాడు. 691లో ఆయన రాసిన పుస్తకం తొలిసారిగా భారత్, చైనాల గురించి పోల్చి అధ్యయనం చేసింది. ఈ పోలిక ప్రధా నంగా రెండు దేశాల్లో అమల్లో ఉన్న వైద్య విధానాలు, ప్రజారోగ్యానికి పరిమితం అయ్యిం ది. తన పరిశోధనలో భారతదేశం నుండి చైనా ఏమి నేర్చుకోగలదు, చైనా నుండి భారతదేశం ఏమి స్వీకరించగలదు అన్న విషయాలను ఆయన ప్రస్తావించాడు. అటువంటి పోలిక నేటికీ ప్రాధాన్యత కలిగి ఉంది. అటువంటి పోలికల చేయడం ద్వారా మనం నేర్చుకోగలిగిన విష యాల గురించి నేను మరో చోట ప్రస్తావించా ను. (ది ఆర్ట్ ఆఫ్ మెడిసిన్, లెర్నింగ్ ఫ్రం అదర్స్, లాన్సెట్, జనవరి 2011) సమకాలీన అధ్యయనాల్లో చైనా భారత్‌ల మధ్య పోలిక అవసరాన్ని ప్రశ్నించటం కంటే పోలిక కోసం ఎంచుకున్న ప్రమాణాల గురించి కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. ప్రస్తుతం భారత ఆర్థికాభివృద్ధిరేటు కుడిఎడంగా 8 శాతం ఉంది. చైనా సాధిస్తున్న రీతిలో భారతదేశం 10 శాతం వృద్ధి రేటు ఎప్పుడు సాధించగలదు అన్న విషయంపై ఎడతెరిపి లేని చర్చ ఊపిరి బిగబట్టి మరీ జరుగుతోంది. ఆర్థికాభివృద్ధి గురించిన చర్చలో ఎంత ఆసక్తి ఉన్నప్పటికీ గుర్రాల పరుగు పోటీలో పందెం కాయటం వంటి ఈ చర్చ అర్థం లేనిది. కేవలం ఆర్థికాభివృద్ధికి సంబం ధించిన అంచనాల్లో వ్యత్యాసం ఉండటంమొక్కటే నా ఈ అభిప్రాయానికి కారణం కాదు. మొత్తం ఆర్థికాభివృద్ధికి లక్ష్యం ప్రజల జీవితాలను మెరుగుపర్చటం. ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటుపెరగ టం వల్ల పరోక్ష ప్రభావంగా ప్రజల జీవితాలు మెరుగయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఇక్కడ కొన్ని గణాంకాలు పరిశీలిద్దాం. ఈ గణాంకాలు ప్రపంచ బ్యాంకు రూపొం దించిన ప్రపంచ అభివృద్ధి నివేదిక, ఐక్య రాజ్యసమితి రూపొందింని మానవాభివృద్ధి నివేదికల నుండి సంకలనం చేయబడ్డవి. ఒక వ్యక్తిపుట్టే నాటి అంచనాల మేరకు సదరు వ్యక్తి చైనాలో 73.5 సంవత్సరాలు బతికే అవకా శాలు ఉంటే భారతదేశంలో మాత్రం సదరు వ్యక్తి 64.4 సంవత్సరాలు మాత్రమే బతుకు తాడు. భారతదేశంలో ప్రతి వెయ్యి మందిలో 50 మంది పుట్టిన వెంటనే చనిపోతున్నారు. చైనాలో అలా చనిపోయే వారి సంఖ్య కేవలం 17 మాత్రమే. ఐదేళ్ల లోపు పిల్లలు భారత దేశంలో ప్రతి వెయ్యి మందిలో 66 మంది చనిపోతుంటే చైనాలో అలా చనిపోయే వారి సంఖ్య కేవలం 19 మాత్రమే. చైనాలో నూటికి 94 మంది వయోజనులు అక్షరాస్యులు కాగా భారతదేశంలో వీరి సంఖ్య 65 మంది మాత్రమే. విద్యార్ధులు సగటున చైనాలో 7.5 సంవత్సరాలు విద్యాభ్యాసం చేస్తుంటే భారత దేశంలో కేవలం 4.4 సంవత్సరాలు మాత్రమే విద్యాభ్యాసం చేస్తున్నారు. భారతదేశంలో మహిళల అక్షర్యాసత శాతం పెంచేందుకు చేసిన ప్రత్యేక కృషి వల్ల 15-24 సంవత్సరాల మధ్య ఉన్న మహిళల్లో అక్షరాస్యులైన వారి సంఖ్య పెరిగిన మాట వాస్తవమే. ఈ ప్రత్యేక ప్రయ త్నాల వల్ల మనం సాధించింది 80 శాతం మహిళలను అక్షరాస్యులను చేయటం కాగా చైనాలో 99 శాతం మంది ఉన్నారు. భారతదేశంలో సగానికిపై పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. చైనాలో ఇదే సమస్యతో బాధపడుతున్నవారి సంఖ్య నామ మాత్రం. భారతదేశంలో మొత్తం పిల్లల్లో 66 శాతానికి మాత్రమే డిపిటి టీకాలు వేస్తే చైనాలో 97 శాతం మందికి ఈ టీకాలు వేశారు. ఇటువంటి ప్రయోజనకరమైన అంశాల గురించి చైనాకు, భారతదేశానికి మధ్య పోలిక చూసుకుంటే ఉపయోగంగా ఉంటుంది. ఇటు వంటి పోలిక మనం ఇంకా ఏమి సాధించాలన్న, అందుకు ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అన్న విషయం వైపు మనలను ప్రేరేపిస్తుంది. ప్రత్యేకించి మనం అనుసరిస్తున్న నిష్క్రి యాపరత్వం నుండి బయటపడటానికి ఇటు వంటి పోలిక ఉపకరిస్తుంది.
చైనా సాధించిన అత్యధిక వృద్ధి రేటు వల్ల పేదరిక నిర్మూలన, మానవాభివృద్ధికి సంబం ధించిన అనేక సూచికలు మెరుగైన మాట వాస్తవం. అదేవిధంగా సాధారణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చటానికీ, అందువల్ల మన్నికైన వృద్ధిరేటు సాధించటానికీ జరిగే ప్రయత్నాలను సమర్థించటానికి మనం వెనకా డాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో భావి తరాల అభివృధ్ధి అవసరాలకు కావల్సినన్ని వనరులు మనం పరిరక్షించాలి. వృద్ధి రేటు గురించిన పిచ్చితో పోలిస్తే మన్నికైన వృద్ధి అన్న భావన మంచిది. అందువల్ల మనం ఏమి చేస్తున్నామన్న విషయంలో మనకు కొంత స్పష్టత ఉండాలి. చైనా సాధించిన తరహాలో వృధ్ది రేటు సాధించాలని పోటీపడటం వెనక ఉన్న ఉత్సాహంలో ఈ స్పష్టత లేదు.
అంతేకాదు, స్థూల జాతీయోత్పత్తి మన దైనిందిన జీవితాలను ప్రతిబింబించే సరైన సూచిక కాదన్న విషయాన్ని కూడా మనం గమనంలోకి తీసుకోవాలి. జీవన ప్రమాణాలు మెరుగపడటం అన్నది మనం ఏమి చేస్తున్నాము, ఏమి చేయటం లేదు అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. కొద్ది సంవత్సరాల క్రితం జీన్ డ్రీజ్ రాసినట్లుగా భారతదేశంలో మానవాభివృద్ధి సూచికలను బంగ్లాదేశ్ మానవాభివృద్ధి సూచిక లతో పోల్చి చూద్దాం. (ది హిందు, సెప్టెంబరు 17, 2004). ఆదాయపరంగా చూస్తే భారత దేశం బంగ్లాదేశ్ కంటే చాలా ముందంజలో ఉంది. భారతదేశ పౌరుడి సగటు తలసరి ఆదాయం 3,250 రూపాయలు అయితే బంగ్లా దేశ్ పౌరుడి సగటుతలసరి ఆదాయం 1550 రూపాయలు మాత్రమే. కానీ ఈ కాలంలో భారతదేశం సాధించిన ఆర్థికాభివృద్ధి రేటు కారణంగా భారతదేశ పౌరుడి తలసరి ఆదా యం బంగ్లాదేశ్ పౌరుల తలసరి ఆదాయం కంటే రెట్టింపుకుపైగా ఉంది. అయితే ఆదాయంలో భారతదేశం సాధించిన ముంద ంజ సామాన్య ప్రజల జీవితాలకు కీలకమైన ఇతర అంశాలను ఏ మేరకు ప్రభావితం చేస్తోం ది? అంతగా ప్రభావితం చేయటం లేదన్నది నా సందేహం.
భారతదేశంలో సగటు ఆయుః ప్రమాణం 64.4 సంవత్సరాలుగా ఉంటే బంగ్లాదేశ్‌లో ఇది 66.9 సంవత్సరాలుగా ఉంది. అంటే భారతదేశ పౌరుడి కంటే బంగ్లాదేశ్ పౌరుడు మరో రెండేళ్లపాటు ఎక్కువ కాలం జీవిస్తాడు. వయసుకు తగ్గ బరువు లేని పిల్లలు భారత దేశంలో (43.5) కంటే బంగ్లాదేశ్‌లో (41.3) తక్కువ. ఫలదీకరణ (ఫెర్టిలిటీ) రేటు కూడా భారతదేశం (2.7) కంటే బంగ్లాదేశ్‌లో (2.3) తక్కువ. పిల్లలు సగటు పాఠశాలకు వెళ్లే సమయం బంగ్లాదేశ్‌లో 4.8 ఏళ్లు అయితే భారతదేశంలో 4.4 ఏళ్లు. పురుషుల అక్షరా స్యత విషయంలో భారతదేశం బంగ్లాదేశ్ కంటే ముందంజలో ఉంది. అయితే మహిళల అక్ష రాస్యతలో బంగ్లాదేశ్, భారతదేశం కంటే ముందంజలో ఉంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బంగ్లాదేశ్‌లో యువతుల అక్షరాస్యత భారతదేశం కంటే ఎక్కువగా ఉంది. విముక్తి చెందిన మహిళలు బగ్లాదేశ్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారన్న అంశం ఈ పురోగతి వెనక కీలక కారణంగా ఉంది.
మిగిలిన అన్ని విషయాల కంటే ఆరోగ్యం గురించి అందరికీ శ్రద్ధ ఉంటుంది. ఐదేళ్ల లోపు పిల్లల మరణం భారతదేశంలో ప్రతివెయ్యికి 66గా ఉంటే బంగ్లాదేశ్‌లో అలా చనిపోయే పిల్లలు వెయ్యికి 52 మాత్రమే. పసిపిల్లల మరణాల్లో కూడా బంగ్లాదేశ్‌దే ఆధిపత్యం. అక్కడ వెయ్యికి 41 మంది మాత్రమే చనిపో తుంటే భారతదేశంలో 52 మంది పిల్లలు చనిపోతున్నారు. బంగ్లాదేశ్‌లో 99 శాతం పిల్లలకు అంటువ్యాధులు రాకుండా టీకాలువేస్తే భారతదేశంలో మాత్రం 66 శాతం మందికి మాత్రమే టీకాలు వెయ్యగలిగాము. భారతదేశం సాధించిన తలసరి ఆదాయంలో సగానికంటే తక్కువ తలసరి ఆదాయం కలిగి ఉన్న బంగ్లాదేశ్ ప్రజల దైనందిన జీవితానికి సంబంధించిన విషయాల్లో ఎంతో పురోగతి సాధించింది.
ఈ విషయాలు ప్రస్తావిస్తున్నంత మాత్రాన ఆర్థికాభివృద్ధి రేటు పెరిగితే బంగ్లాదేశ్‌లో సామాజిక అభివృద్ధి సూచికలకు పెద్దగా ప్రయోజనం ఉండదన్న నిర్ధారణకు రావటం పొరపాటు అవుతుంది. కేవలం ఆర్థికాభివృద్ధి సాధించటమే లక్ష్యంగా అనుకోవటం కంటే అటువంటి వృద్ధి రేటు సాధించటం ద్వారా మరింత మంచి పనులు సాధించవచ్చు అన్న దృష్టి ఉంటే పెరుగుతున్న వృద్ధి రేటు ఫలాలు సామాజిక అభివృద్ధిలో ప్రతిఫలిస్తాయి. బంగ్లాదేశ్‌లో తలసరి ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ ఈ మాత్రం సామాజిక అభివృద్ధి సాధించగలగటం వెనక ప్రభుత్వేతర సంస్థల పాత్ర కీలకంగా ఉంది. వీటితో పాటు ప్రభుత్వ విధానాల్లో ప్రాధాన్యతలు కూడా కారణం. అయితే మరింత ఎక్కువ ఆదాయం, మెరుగైన ప్రభుత్వ వనరుల కేటాయింపు ద్వారా ప్రజలకు మేలు చేయాలన్న బంగ్లాదేశ్ ప్రభుత్వ శక్తి సామర్ధ్యాలు మరింతగా పెంచవచ్చు.
ఆర్థికాభివృద్ధి రేటు గొప్పదనం ఏమిటంటే ప్రభుత్వ ప్రాధాన్యతలకనుగుణంగా వెచ్చించ టానికి అవసరమైన నిధులను, వనరులను సమకూర్చుకునే అవకాశం ప్రభుత్వానికి ఇది కల్పిస్తుంది. స్థూలజాతీయోత్పత్తి కంటే వేగంగా ప్రభుత్వ వనరులు పెరుగుతాయి. స్థూల జాతీయోత్పత్తి 7-8 శాతం చొప్పున పెరుగు తుంటే ప్రభుత్వ వనరులు 9-12 శాతం చొప్పున పెరుగుతాయి. 1990-1991 భారత ప్రభుత్వానికి పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం కంటే నేడు పన్నుల ద్వారా వచ్చే ఆదాయం నాలుగు రెట్లు ఎక్కువ. అంటే స్థిరీకరించబడిన ధరలతో పోలిస్తే స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు కంటే ఇది ఎక్కువ.
సామాజిక రంగం అని పిలిచే రంగంపై , విద్య, వైద్య రంగాల్లో కేంద్ర ప్రభుత్వం వెచ్చించే వ్యయం ఈ కాలంలో పెరిగిందన్నది నిస్సం దేహం. ఇది సంతోషించాల్సిన విషయం. అయినప్పటికీ మనం ఇంకా అనేక రంగాల్లో చైనా కంటే వెనకబడే ఉన్నాము. వైద్యరంగంలో చైనాలో ప్రభుత్వ వ్యయం భారతదేశంలో ప్రభుత్వ వ్యయం కంటే ఐదురెట్లు ఎక్కువ. భారతదేశపు తలసరి ఆదాయం కంటే చైనా తలసరి ఆదాయం ఎక్కువే అన్నది నిజమే. చైనా తన స్థూల దేశీయోత్పత్తిలో రెండు శాతం వైద్యరంగ అవసరాలపై వెచ్చిస్తుంటే భారతదేశం కేవలం ఒక్క శాతం మాత్రమే వెచ్చిస్తోంది.
భారతదేశంలో వైద్య రంగంపై ప్రభుత్వ వ్యయం నామమాత్రంగా ఉండటంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు వైద్య అవసరాల కోసం ప్రధానంగా ప్రైవేటు ఆసుపత్రులపై ఆధార పడుతున్నారు. ఈ ప్రైవేటు వైద్యుల్లో చాలా మందికి వైద్యవిద్యలో ప్రాథమిక జ్ఞానాన్ని మించిన పరిజ్ఞానం ఉండదు. శిక్షణ ఉండదు. ఆరోగ్యం విషయంలో సమాచారం ఇచ్చి పుచ్చుకోవాలి. వైద్యులు ఏ తరహా మందులు ఇస్తున్నారో కనీసం తెలుసుకునే హక్కు రోగులకు ఉంటుంది. కానీ ప్రైవేటు ఆసుపత్రులపై ఆధారపడ్డప్పుడు రోగులను మోసగించటానికి పుష్కలమైన అవకాశాలు ఉంటాయి. 'ప్రతిచి' ట్రస్టు నిర్వహించిన అధ్యయనంలో రోగుల అమా యకత్వాన్ని ఆసరా చేసుకుని వారికి అవసరం లేని వైద్యం అంటగట్టి డబ్బులు గుంజుతున్న వైనం వెల్లడైంది. ప్రాథమిక వైద్య సదు పాయాలను ప్రైవేటీకరించే ప్రయత్నంలో నాటువైద్యం, తాంత్రికవైద్యం వంటివాటికి కూడా స్థానం కలిగింది. దీంతో కేవలం అమానుషమైన దోపిడీయే కాదు, దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ప్రాథమిక వైద్య సదుపాయాలు కూడా అందు బాటులోకి రావటం లేదు.
ఇక్కడ కీలకమైన అంశం ఏమిటంటే జీవన ప్రమాణాలు పెంపొందించటానికి ఆర్థికాభివృద్ధి అవసరమే. అయితే ఆర్థికాభివృధ్ధి ఏమేరకు ప్రజలకు చేరుతుందన్న విషయం మనం ఆ అభివృద్ధితో ఏమి సాధించాలనుకుంటున్నా మన్నదానిపై ఆధారపడి ఉంటుంది. గణనీ యమైన సంఖ్యలో ఉన్న కొందరికి అభివృద్ధి అభివృద్ధి కోసమే అన్నది వాస్తవం. ఎందుకంటే వారు సంపన్నవంతులు. సామాజిక సహ కారంతో నిమిత్తం లేకుండానే జీవించగలవారు. అటువంటి వారికి ఆర్థికాభివృద్ధితో పాటే అవకాశాలూ పెరుగుతుంటాయి. అటువంటి అవకాశాలు మంచివే. ఆర్థికాభివృద్ధితో అటు వంటి అవకాశాలు మెరుగుపర్చుకోవటంలో తప్పేమీ లేదు. ఎందుకంటే సంఖ్యాపరంగా అటువంటి సంపన్నులు భారతదేశంలో గణ నీయంగానే ఉన్నారు. అయితే తరచూ మీడియాలో కనిపించే వారి విలాసవంతమైన జీవితాలు దేశ వాస్తవికతను ప్రదర్శించవు.
బహుశా ఈ సంపన్నవంతులు తరచూ ఆర్థికాభివృద్ధి సాధిస్తే అన్నీ సాధించినట్లే అన్న పొరపాటు అభిప్రాయానికి లోనయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఆర్థికాభివృద్ధి నేరుగా వారి సంపద విలువను పెంచుతుంది. దీనికోసం అదనంగా వారు కష్టపడాల్సింది ఏమీ లేదు. ఇటువంటి పరిస్థితుల వల్ల వారు ఒకరకమైన ప్రత్యేక తరగతిగా మారిపోతారు. దేశంలో అత్యధిక ప్రజానీకం ఎదుర్కునే కష్టనష్టాలను పదే పదే గుర్తుచేసే సామాజిక కార్యకర్తలను 'జోలె తగిలించుకుని తిరుగుతారు' అని వీళ్లు ఎద్వేవా చేయడం నేను తరచూ వింటున్నాను. ఈ సామాన్య ప్రజలే దేశానికి బాసట. వాస్త వానికి మెజారిటీ భారతీయుల జీవితాల్లో మెరుగుదల రానంతవరకూ మనం ఏమి సాధిం చినా లెక్కలోకి రాదు. ఏమీ సాధించనట్లే లెక్క.
సంపన్నవంతుల లోగిళ్లలో లెక్కకు రాని ముడితరహా సమస్యలు ఉంటాయన్న విషయాన్ని ప్రస్తావిస్తే సామాజిక అసమానతల గురించి మాట్లాడేవారు నిరాశచెందుతారేమో. అటువంటి అత్యుత్సాహంతో భారతదేశం నిజంగా సాధిం చాల్సినవీ, ప్రజలకు మరింతగా అందిం చాల్సినవీ అందించలేకపోతున్నామని, సాధిం చలేకపోతున్నామని నా ఆందోళన. సరైన చర్యలు తీసుకుంటే ఆర్థికాభివృద్ధి వల్ల ప్రజలకు మరింత ప్రయోజనం ఒనగూడేలా చేయొచ్చు. అందువల్ల అభివృద్ధి యొక్క పాత్ర, విలువ గురించి మరింత స్పష్టత కలిగి ఉండటం ప్రయోజనకరం.

No comments:
Post a Comment