Popular Posts

Tuesday, June 5, 2012

యుద్ధాలపై అమెరికా చేసిన వ్యయం 4.4 ట్రిలియన్ డాలర్లు

యుద్ధాలపై అమెరికా చేసిన వ్యయం 4.4 ట్రిలియన్ డాలర్లు


ఒసామా బిన్ లాడెన్ సారధ్యంలో జరిగిన 2001 సెప్టెంబర్‌ 11 దాడుల తర్వాత అమెరికా చేస్తున్న యుద్ధాల్లో 2,25,000 మృతి చెందగా 4.4 ట్రిలియన్ డాలర్ల వ్యయం జరిగినట్లు బ్రౌన్ యూనివర్శిటీ చేపట్టిన అధ్యయనంలో తేలింది. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్‌లలో యుద్ధాలతో పాటు పాకిస్థాన్, యెమన్‌ల్లో అమెరికా చేపడుతున్న తీవ్రవాద వ్యతిరేక పోరాటాలపై బ్రౌన్ యూనివర్శిటీ దృష్టి పెట్టింది.

యుద్ధానికి పట్టే సమయం, వ్యయంపై అమెరికా పాలకులు సరిగా అంచనా వేయలేకపోయారని ఈ అధ్యయనం పేర్కొంది. సుదీర్ఘకాలంగా అమెరికా చేస్తున్న యుద్ధాల్లో 2,25,000 మృతి చెందగా 3,65,000 గాయపడ్డారని వెల్లడించింది. కాగా ఈ యుద్ధాల్లో 31,741 మంది సైనికులు మరణించగా వీరిలో 6,000 మంది అమెరికన్లు, 1,200 మంది భాగస్వామ్య దేశాలకు చెందినవారు. 9,900 మంది ఇరాకీయులు, 3,500 పాకిస్థానీయులు, 8,800 మంది ఆఫ్ఘన్ సైనికులతో పాటు 2,300 మంది అమెరికా ప్రైవేట్ భద్రతా కాంట్రాక్టర్లు కూడా ఉన్నారు.

పెట్టుబడిదారీ సంక్షోభంపై పెరుగుతున్న ఆగ్రహం

పెట్టుబడిదారీ సంక్షోభంపై పెరుగుతున్న ఆగ్రహం

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత మాంద్యంలోకి జారకుండా తగిన చర్యలు తీసుకోవాలని జొహన్సెస్‌బర్గ్‌లో ఇటీవల జరిగిన ఇండియా, బ్రెజిల్‌, దక్షిణాఫ్రికా దేశాల (ఇబ్సా) శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అభివృద్ధి చెందిన దేశాలకు విజ్ఞప్తి చేశారు. జి-20 నాయకుల సమావేశం ఫ్రాన్స్‌లోని కేన్స్‌లో జరగడానికి పదిహేను రోజుల ముందు ఆయన ఈ పిలుపునిచ్చారు.
ఈ సదస్సుకు హాజరు కావడానికి బయల్దేరి వెళ్లేముందు ప్రధాని భారత ఆర్థిక వ్యవస్థ మేనేజర్లు, సలహాదారులతో ఉన్నత స్థాయీ సంప్రదింపులు జరిపారు. భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న అధిక ద్రవ్యోల్బణం, వేగంగా పడిపోతున్న పారిశ్రామికాభివృద్ధి అనే జంట సమస్యల గురించి ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి అభివృద్ధి చెందిన దేశాలకు ఇచ్చిన పిలుపు, భారత ఆర్థిక వ్యవస్థకు ఇస్తున్న చిట్కాలు నయా ఉదారవాద ఆర్థిక సంస్కరణల పరిధిలోనే పరిష్కారాల కోసం యుపిఎ-2 ప్రభుత్వం అన్వేషిస్తోందని స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిష్కారారాలు భారత దేశ ప్రజల జీవనాలను మరింత దిగజారుస్తాయి.
ప్రపంచ దేశాలకు చెందిన అనేక మంది నాయకుల మాదిరిగా భారత ప్రధాని కూడా ప్రపంచీకరణకు వ్యతిరేకంగా వాల్‌స్ట్రీట్‌లో విస్తరిస్తున్న ప్రదర్శనలను విస్మరిస్తున్నట్లు ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలు స్పష్టం చేస్తున్నాయి. ఆస్ట్రేలియా నుండి ఆసియా, యూరప్‌, అమెరికాల్లో ప్రదర్శనలు జరిగాయి. ప్రపంచవ్యాప్త కార్యాచరణలో భాగంగా 82 దేశాల్లో 1,500కుపైగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. న్యూయార్క్‌లోని మన్‌హటన్‌ ఆర్థిక జిల్లాలోని లిబర్టీ స్క్వేర్‌ వద్ద 2011 సెప్టెంబర్‌ 17న ప్రారంభమైన ముట్టడి ప్రస్తుతం అమెరికాలోని 100కుపైగా నగరాలకు విస్తరించింది. ప్రపంచాన్ని మరోసారి మాంద్యంలోకి నెట్టివేసే ప్రస్తుత పెట్టుబడిదారీ సంక్షోభానికి కారణమైన కార్పొరేట్‌ శక్తుల మితిమీరిన స్వార్ధానికి నిరసనగా ఈ ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఒకవైపు బోస్టన్‌లో బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా భవనానికి వెలుపల గుమికూడిన ప్రదర్శకులు వర్గ పోరాటాన్ని ప్రారంభించగా ఈ ప్రదర్శనలు వర్గపోరాటం స్థాయికి చేరుకోవచ్చుననే ఆందోళనను రిపబ్లికన్‌ పార్టీ వ్యక్తం చేసింది.
ప్రపంచవ్యాప్తంగా మాంద్యం ప్రారంభమైన తరువాత కార్ల్‌ మార్క్స్‌ దాస్‌ క్యాపిటల్‌ పుస్తకం అమ్మకాలు జోరందుకున్నట్లు సమాచారం. పోప్‌ కూడా వాటికన్‌ సిటీకి కొన్ని కాపీల కోసం ఆర్డర్‌ ఇచ్చారని వార్తలు సూచిస్తున్నాయి. వియత్నాం యుద్ధానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరుగుతున్న సమయంలో బోస్టన్‌ నగరంలోని యూనివర్శిటీ ప్రాంగణంలో ''గ్రేడ్‌ సంపాదించాలంటే, మార్క్స్‌ సిద్ధాంతాల పట్ల మంచి అవగాహన కలిగి ఉండాలని సూచిస్తూ కొన్ని పోస్టర్లు వెలిశాయి. పెట్టుబడిదారీ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందో, సంక్షోభాలకు మూలమేమిటి అన్న అంశాలపై అవగాహన ఏర్పరచుకోగోరే వ్యక్తులు దాస్‌ కాపిటల్‌ పుస్తకం మొదటి సంపుటిలోని చివరి అధ్యాయం చదవడం మంచిది. ''పెట్టుబడి తల నుండి పాదాల వరకు ప్రతి చిన్న బెజ్జం నుండి రక్తం, ధూళితో జాలువారుతూనే ఉంటుంది.''. టి జె డన్నింగ్‌ అనే ఒక కార్మికుడు రాసిన ఫుట్‌నోట్‌తో మార్క్స్‌ దీనిపై ఈ పెట్టుబడి స్వభావం గురించి ఇలా వర్ణించాడు. ''తగిన లాభం ఉంటే పెట్టుబడి సాహసోపేతంగా వ్యవహరిస్తుంది. పది శాతం లాభం కచ్చితంగా వస్తుందంటే అది ఎక్కడికైనా పరుగులు తీస్తుంది. 20 శాతం లాభం వస్తుందంటే తహతహలాడుతుంది. 50 శాతం లాభం వస్తుందనుకుంటే ఒకింత తెంపరితనాన్ని ప్రదర్శిస్తుంది.నూటికి నూరు శాతం లాభం వస్తుందంటే అన్ని రకాల మానవ చట్టాలను అతిక్రమించడానికి సిద్ధమవుతుంది. 300 శాతం లాభం వస్తుందంటే అది ఏ అఘాయిత్యానికైనా వెనకాడదు. చివరికి యజమానికి ఉరిశిక్ష పడుతుందనుకున్నా లెక్కచేయదు.''. ఏదిఏమైనా వీలైనంత ఎక్కువగా లాభాలను సంపాదించాలనే పెట్టుబడిదారీ వ్యవస్థ అంతర్గత లక్షణమే ప్రస్తుత సంక్షోభానికి అసలు కారణం. కొంతమంది వక్తుల స్వార్థం, నియంత్రణ వ్యవస్థల వైఫల్యం వల్ల ఈ సంక్షోభం తలెత్తలేదు.
లాభం ఎక్కువగా సంపాదించాలని కోరుకోవడం అత్యంత సహజం. ఇది పెట్టుబడిదారీ వ్యవస్థ ముఖ్య లక్షణం. పెట్టుబడిదారీ వ్యవస్థకు, దురాశకు మధ్య సంబంధం లేదని, దానిని నియంత్రించవచ్చునని చెప్పడం పూర్తిగా సత్యదూరం పెట్టుబడిదారీ వ్యవస్థకు, దురాశకు మధ్య విడదీయరాని సంబంధం ఉంటుంది. వ్యవస్థలోనే దోషం ఉంది కానీ పెట్టుబడిదారుల ఆలోచనల్లో, ఆకాంక్షాల్లో లేదు. పెట్టుబడిదారీ దేశంలో నిరపాయకరమైన తటస్థ వ్యవస్థ ఉంటుందనే ప్రచారంలో కూడా నిజం లేదు. దాని సహజ లక్షణానికి అనుగుణంగా ఈ సంక్షోభానికి మొదటగా అసలు కారణమైన బడా పెట్టుబడిదారులకు పెట్టుబడిదారీ ప్రభుత్వం ఉద్దీపన పథకాలను ప్రకటించింది. అమెరికా ప్రభుత్వ ఉద్దీపన పథకాల గురించి ప్రత్యేక ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఈ విధంగా పేర్కొన్నారు. ''2007లో ఆర్థిక సంక్షోభం ప్రారంభమైనప్పటి నుండి ఫెడరల్‌ ప్రభుత్వం అనేక ఏజెన్సీల ద్వారా ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇచ్చేందుకు అనేక కార్యక్రమాలను అమలు చేసింది. ఫెడరల్‌ ప్రభుత్వం ఇలా సహాయమందించే మొత్తం సామర్ధ్యం 23.7 ట్రిలియన్‌ డాలర్లకు చేరవచ్చు''. అని ఆయన పేర్కొన్నారు. 14 ట్రిలియన్‌ డాలర్లు మాత్రమే ఉన్న అమెరికా జిడిపితో ఈ మొత్తాన్ని పోల్చి చూడండి. అమెరికా ఆర్థిక శాఖ ప్రతినిధి ఈ గణాంకాలు నిజం కావని పేర్కొన్నారు. అదేవిధంగా అనేక అభివృద్ధి చెందిన దేశాల ప్రభుత్వాలు ఇటువంటి ఉద్దీపన పథకాలను అమలు చేసేందుకు పెద్ద ఎత్తున రుణాలు చేశాయి. కార్పొరేట్‌ దివాళాలు ఆ విధంగా ప్రభుత్వ దివాళాలుగా రూపాంతరం చెందాయి. గ్రీస్‌ ఆర్థిక వ్యవస్థ మొత్తంగా కుప్పకూలిపోయింది. స్పెయిన్‌ అదే బాటలో నడిచేందుకు సిద్ధంగా ఉంది. రుణ భారం మోయలేక యూరోపియన్‌ యూనియన్‌ తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. యూరోపియన్‌ దేశాలు అత్యంత కఠినమైన పొదుపు చర్యలను అమలుచేస్తూ సామాన్య ప్రజల జీవితాలను దుర్భరం చేస్తున్నాయి. వాటి ఉద్దేశంలో పొదుపు చర్యలంటే మరేమీ కాదు, సామాజిక ప్రయోజనాలపై, కార్మికుల కోసం పెట్టే వ్యయంపై కోత విధించడమే. దీంతో సార్వత్రిక సమ్మెలు, నిరసన ప్రదర్శనలు సర్వసాధారణమయ్యాయి.
సంక్షోభం ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. అమెరికాలోని ప్రతి ఆరుగురు పౌరుల్లో ఒకరు పేదరికంలో మగ్గుతున్నారని కొత్త జనగణన సమాచారం వెల్లడించింది. వరుసగా మూడో సంవత్సరం సాధారణ కుటుంబీకుల ఆదాయం తగ్గింది. అధికార నిరుద్యోగ రేటు ప్రస్తుతం 9.1శాతం ఉంది. అంటే 1.4 కోట్ల మంది ఎటువంటి పని లేకుండా నిరుద్యోగులుగా ఉన్నారు. స్థూల పేదరిక రేటు 2009లో 14.3 శాతం ఉండగా 2010 నాటికి అది 15.1 శాతానికి, అంటే 4.62 కోట్లకు పెరిగింది. ఒక కుటుంబ వార్షిక ఆదాయం 22,300 డాలర్ల ప్రాతిపదికగా పేదరిక రేటును నిర్ణయిస్తారు. వాస్తవ మధ్యతరగతి కుటుంబాల ఆదాయం 2007తో పోలిస్తే 6.4 శాతం తగ్గి 49,945 డాలర్లకు చేరుకుంది. నల్లజాతి కుటుంబాల ఆదాయం 15 శాతం పడిపోయింది. ఆఫ్రికన్‌-అమెరికన్‌ ప్రజల నిరుద్యోగ రేటు ప్రస్తుతం 16.7 శాతం ఉంది. మాంద్యం ప్రభావాన్ని ప్రతిబింబించే విధంగా అమెరికా పేదరిక రేటు తీవ్ర ఇంధన సంక్షోభం, నయా ఉదారవాద విధానాలను అనుసరించి ప్రభుత్వ వ్యయాలపై కోత విధించిన కారణంగా ద్రవ్యోల్బణం పెరగడంతో వడ్డీ రేట్లు, నిరుద్యోగం పెరిగిన 1980ల్లోని ఏ మూడు సంవత్సరాల కాలం కంటే 2007-10 సంవత్సరాల మధ్య వేగంగా పెరిగింది. పేదరికంలో మగ్గుతున్న పేదల సంఖ్య 4.6 కోట్లు. 1959లో జనగణన ప్రారంభమైన తరువాత ఇంత అత్యధికంగా ఎన్నడూ లేదు. 1983 తరువాత 19993 ప్రాతిపదికగా నిరుపేదలుగా ఉన్న శాతంతో పోలిస్తే ప్రస్తుతం గణనీయంగా పెరిగింది. దేశంలో అగ్రస్థానంలో ఉన్న ఒక శాతం వర్గం ఆదాయంలో పొందుతున్న వాటా సుమారు 20 శాతం ఉంది. ఇది 1970ల్లో సుమారు ఎనిమిది శాతం ఉంది.
ప్యూ రీసెర్చ్‌ కేంద్రం విశ్లేషించిన అమెరికా కొత్త జనగణన వివరాల ప్రకారం ఆర్థిక మాంద్యం అమెరికా ప్రజల సంపదపై తీవ్ర ప్రభావం చూపింది. అయితే ఇందులో శ్వేతజాతీయులు కోల్పోయింది అత్యంత స్వల్పం.2005-2009 మధ్య హిస్పానిక్‌ కుటుంబీకుల ఆదాయం 66 శాతం తగ్గింది. నల్లజాతి కుటుంబీకుల ఆదాయం 53 శాతం తగ్గింది. అయితే శ్వేతజాతీయుల కుటుంబాల ఆదాయం 16 శాతం తగ్గింది. శ్వేత జాతి కుటుంబీకుల ఆదాయం నల్లజాతి కుటుంబీకుల ఆదాయం కంటే 20 రెట్లు, హిస్పానిక్‌ కుటుంబీకుల ఆదాయం కంటే 18 రెట్లు ఎక్కువగా ఉంది. ఈ తేడా మాంద్యం ముందున్న అంతరం కంటే రెండు రెట్లు ఉంది. 1984లో సమాచారం సేకరించడం ప్రారంభించాక అత్యధిక మొత్తంలో ఉంది. ఆసియన్‌ అమెరికన్‌ కుటుంబీకుల సంపద కూడా మాంద్యం దెబ్బకు కుదేలైంది. 2005లో సగటు ఆదాయంతో పోలిస్తే 2009లో బాగా తక్కువగా ఉంది. ఇది సగటున 54 శాతం తగ్గింది. 2005-2009 మధ్య అత్యంత సంపన్నవంతులైన 10 శాతం కుటుంబీకులకు దేశ సంపదలో వాటా 49 నుండి 56 శాతానికి పెరిగింది. ప్రత్యేకంగా ఎటువంటి ఆస్తులు లేని అమెరికా ప్రజల సంఖ్య బాగా పెరిగింది. హిస్పానిక్స్‌లో మూడవ వంతు మంది ఆదాయ వాటా 2005లో 23 ఉండగా 2009 నాటికి సున్నా శాతానికి చేరుకుంది. అదే సమయంలో ఆస్తులు లేని నల్లజాతీయుల సంఖ్య 29 నుండి 35 శాతానికి పెరిగింది. శ్వేత జాతీయుల సంఖ్య 11 నుండి 15 శాతానికి పెరిగింది. అమెరికాలో ప్రజల ఆదాయాల మధ్య తేడా పెరుగుతున్నట్లు అనేక సంవత్సరాల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 1930 నాటి మహా మాంద్యం తరువాత ఇంతటి తీవ్ర స్థాయిలో అంతరాలు ఎన్నడూ లేవు.
మరోవైపు సంక్షోభం ప్రారంభమైన వాల్‌స్ట్రీట్‌లో అపర కుబేరుల పరిస్థితి ఏమిటి? దివాళా తీసిన సంస్థగా గుర్తింపు పొందిన బ్యాంక్‌ ఆఫ్‌ ఆమెరికా 2011 ప్రధమార్ధంలో 3.7 బిలియన్‌ డాలర్ల ఆదాయం సంపాదించింది. గోల్డ్‌మాన్‌ సచ్‌ తన ఎగ్జిక్యూటివ్‌లకు 5.23 బిలియన్ల డాలర్ల బోనస్‌ చెల్లించింది. అదనపు నికర ఆదాయాలు 11.89 బిలియన్లుగా నమోదయ్యాయి. ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో 2.7 బిలియన్‌ డాలర్ల నికర ఆదాయాన్ని ఆర్జించింది.
ఈ పరిస్థితుల్లో పైన పేర్కొన అంశాలపై ప్రధాని ఆ విధంగా ఆందోళన చెందడం సహజమే. కానీ, భారతదేశంలో ఉన్న మనకు ఆయన చూపిస్తున్న పరిష్కాలేమిటి? ద్రవ్యోల్బణం సెప్టెంబరులో 9.72 శాతానికి, ఆహార ద్రవ్యోల్బణం తాజాగా 10.6 శాతానికి చేరుకున్నాయి. ఇంధనం, వినిమయ వస్తువుల ధరలు చుక్కలనంటుతున్నాయి. మరో వైపు పారిశ్రామిక ఉత్పత్తి సూచి 4.1శాతానికి పడిపోయింది. ప్రపంచ ఆర్థిక మాంద్యం దెబ్బకు జులై-సెప్టెంబరు మధ్య మన ఎగుమతులు 82 శాతం నుండి 36 శాతానికి పడిపోయాయి. దేశీయంగా డిమాండ్‌ మందగించడంతో దిగుమతులూ తగ్గుముఖం పట్టాయి. దీంతో మన వాణిజ్యలోటు అసాధారణ స్థాయిలో రు.3,67,500కోట్లు (7,.350 కోట్ల డాలర్లు)కు చేరుకుంది. ద్రవ్యోల్బణం అదుపునకు ఆర్‌బిఐ చేపట్టిన చర్యలతో రుణాలు అందుబాటులో లేకుండా పోతున్నాయి. ఇది పెట్టుబడుల క్షీణతకు దారితీస్తుందని పెట్టుబడిదారులు ఆక్షేపిస్తున్నారు. వారు చెబుతున్న దాని ప్రకారం పెట్టుబడి వ్యయం ఎంత తక్కువగా ఉంటే పెట్టుబడులు అంత ఎక్కువగా పెరుగుతాయి. అప్పుడది అధిక వృద్ధిరేటుకు తోడ్పడుతుంది. ఆహా! ఏమి సూత్రీకరణ. ఇంతకన్నా తప్పుడు భావన మరొకటి ఉండదు. ప్రజల చేతిలో కొనుగోలు శక్తి పెరగకుండా అధికోత్పత్తి సాధించి ప్రయోజనమేమిటి? అధిక పెట్టుబడులు పెట్టి సాధించిన ఉత్పత్తిని అమ్ముకోవాలంటే ప్రజల చేతిలో కొనుగోలు శక్తి ఉండాలి కదా. ప్రపంచ వ్యాపితంగాను, మన దేశంలోనూ ఇప్పుడదే కొరవడింది. నయా ఉదారవాద విధానాల చిట్కాలు వికటించాయి. స్పెక్యులేటివ్‌ లాభాలను ఇబ్బడిముబ్బడిగా పెంచుకునేందుకే ఈ చౌక రుణాలు ఉపయోగపడతాయి. ప్రపంచ వ్యాపితంగా ఇటువంటి ధోరణే మనకు కనిపిస్తుంది. ఆర్థిక మాంద్యానికి ఏ ఫైనాన్షియల్‌ కార్పొరేట్లు అయితే కారణమయ్యారో ఆ కార్పొరేట్లే ఈ గడ్డు పరిస్థితుల్లో సైతం తమ చట్టా వ్యాపారాన్ని (స్పెక్యులేటివ్‌ ట్రేడింగ్‌) మొదటి త్రైమాసికం నుంచి మూడవ త్రైమాసికానికి డెరివేటివ్స్‌ రూపంలో 11.3 లక్షల కోట్ల డాలర్లకు మేరకు పెంచుకున్నాయి. ఈ మాంద్యానికి కారకులైన ప్రధాన నేరస్థులు జెపి మోర్గాన్‌ చేజ్‌, సిటీగ్రూప్‌, బ్యాంకు ఆఫ్‌ అమెరికా, గోల్డ్‌మన్‌ శాచ్సే. స్పెక్యులేటివ్‌ వ్యాపారంలో ఈ నాలుగు సంస్థల వాటాయే 90 శాతం దాకా ఉంది.
కీన్స్‌ చెప్పినట్లు ఇంత నగంగా భారీ లాభాలను జుర్రుకోకుండా కొంతమేరకైనా నియంత్రించేందుకు ప్రభుత్వ జోక్యం అనేది ఒక మార్గం. అంతర్గత వైరుధ్యాల మూలంగా సంక్షోభ వలయంలో కొట్టుమిట్టాడే పెట్టుబడిదారీ వ్యవస్థను కూలిపోకుండా నిలబెట్టడానికి ప్రజలకు కాసింత ఉపశమనం కలిగించేందుకే కీన్స్‌ సిద్ధాంతం తోడ్పడుతుంది. కీన్స్‌ సూచించిన ప్రభుత్వ జోక్యాన్ని నయా ఉదారవాద విధానాల కాలంలో ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టి కార్పొరేట్లను మేపడానికి ఉపయోగిస్తున్నారు. నేడు ఈ వ్యవస్థ ఇంతగా అస్థిరతకు గురికావడానికి ఇదొక ముఖ్య కారణం.
భారత దేశ విషయానికొస్తే మేము ఇంతకుముందు ఇదే కాలమ్‌లో పదే పదే పేర్కొన్నట్లు మన ఆర్థిక మూలాలు సుస్థిరంగా, పటిష్టంగా ఉండాలంటే మన ప్రజల చేతిలో కొనుగోలు శక్తిని పెంచేలా ప్రభుత్వ జోక్యం, పాత్ర ఉండేట్లు ప్రణాళికలు రూపొందించాలి. కొనుగోలు శక్తి పెరిగితే అది సుస్థిర అభివృద్ధికి దోహదపడుతుంది.
గత రెండు బడ్జెట్ల పత్రాలను పరిశీలిస్తే సంపన్నులకు రు.5లక్షల కోట్ల మేర పన్ను రాయితీలను ప్రభుత్వం ఇచ్చింది. ఈ ధోరణిని ప్రధాని, ఆయన సలహాదారులు మార్చుకోవాలి. ఈ డబ్బును నిధులకొరతతో సతమతమవుతున్న మౌలిక సదుపాయాలు వంటి పబ్లిక్‌ వర్కు ప్రాజెక్టుల్లో పెడితే అది పెద్దయెత్తున ఉపాధి పెరుగుదలకు, తద్వారా ప్రజల చేతిలో కొనుగోలు శక్తి పెరగడానికి ఉపయోగపడుతుంది. ఈ అవకాశం ఇప్పటికీ ఉంది. యుపిఏ-2 ప్రభుత్వం మెడలు వంచేందుకు ప్రజా ఉద్యమాలు, నిరసన కార్యక్రమాలను ఉధృతం చేయాలి.

ప్రపంచ కోటీశ్వరుల జాబితాలో ఇండియా

ప్రపంచ కోటీశ్వరుల జాబితాలో ఇండియా

* సర్వేలో వెల్లడైన వాస్తవాలు
* ఆస్తి పరులపై సర్వే చేసిన మెరిల్ లించ్ వెల్త్ మేనేజ్‌మెంట్‌ సంస్థ
* పది లక్షల డాలర్ల కంటే ఎక్కువగా పెట్టుబడి పెట్టినవారిపైనే దృష్టి
* 12 వ స్థానంలో ఇండియా
* భారత్‌లో కోటీశ్వరుల సంఖ్య 1,53,000 మంది
* గతేడాది 1,26,700 మంది
పేదల నిలయం భారత్‌ అన్నది పాత మాట. అత్యధికంగా కోటీశ్వరులు కలిగిన దేశాల జాబితాలో భారత్‌ 12 వ స్థానంలో నిలిచినట్లు ఓ సర్వే సంస్థ తేల్చింది. ఇండియాలో లక్ష్మీ పుత్రుల జాబితా ప్రతి సంవత్సరం పెరుగుతోందని నివేదికలో వెల్లడైంది. ప్రపంచ పేద దేశాలలో భారత్‌ ఒక్కటిగా ఉన్నా క్రమేణా సంపన్న దేశాల జాబితా చేరనుందా..అంటే అవుననే అంటున్నాయి సర్వే సంస్థలు. ఇటీవల ఇండియాలో కోటీశ్వరుల సంఖ్య పెరుగుతోందని వరల్డ్‌వైడ్‌ కోటీశ్వరుల సంఖ్యపై మెరిల్ లించ్ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌, క్యాంప్‌ జెమినీ నిర్వహించిన సర్వేలో తేలింది.
గత ఏడాది దేశంలో కోటీశ్వరుల సంఖ్య గణనీయంగా పెరిగి భారత్ లక్ష్మీపుత్రుల నిలయంగా మారుతోందని నివేదిక ప్రకటించింది. పది లక్షల డాలర్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టగలిగిన ఆస్తిపరులను సర్వే పరిగణనలోకి తీసుకుంది. అత్యధిక సంఖ్యలో కోటీశ్వరులు కలిగిన దేశాల జాబితాలో భారత్ 12వ స్థానంలో నిలవడం ఇదే ప్రథమం. దీని ప్రకారం దేశంలో కోటీశ్వరుల సంఖ్య లక్షా యాభై మూడు వేల మందికి పెరిగింది. 2009 సంవత్సరంలో ఆ సంఖ్య లక్షా ఇరవై ఆరు వేల ఏడు వందల మంది మాత్రమే.
భారత్‌లో కుబేరుల సంఖ్య పెరగడంతో యూరఫ్‌ను అధిగమించి ఆసియా పసిఫిక్ రెండో ప్రాంతంగా నిలిచిందని 2010 ఏడాదికి చెందిన వార్షిక ప్రపంచ సంపద నివేదిక పేర్కొంది. ౩1 లక్షల నాలుగు వేల మంది కుబేరులతో అమెరికా ప్రధమ స్థానంలో ఉండగా జపాన్‌, జర్మనీ, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్‌, కెనడా, స్విట్జర్లాండ్‌, ఆస్ట్రేలియా, ఇటలీ బ్రెజిల్‌, భారత్‌ తరువాతి స్థానాలను ఆక్రమించాయి. ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో జపాన్‌, చైనా తర్వాత భారత్‌లోనే లక్ష్మీపుత్రుల సంఖ్య అధికమని నివేదిక తేల్చింది. విలాసవంతమైన కార్లు, విమానాల కొనుగోలుపై భారత్ సంపన్నుల్లో ఆసక్తి పెరిగిందని కూడా నివేదిక వెల్లడించింది.
ప్రపంచ కోటీశ్వరుల్లో అమెరికా, జపాన్‌, జర్మనీల వాటా 53 శాతం కావడాన్ని నివేదికలో ప్రత్యేకంగా పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్న బారత్‌ సంపన్న దేశాల జాబితాలో చేరుతుండటంతో ఆర్థిక వేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సురక్షిత నీటి కరువు

సురక్షిత నీటి కరువు

  • ధనిక దేశాల్లో పేదల స్థితి
  • ఐరాస నిపుణురాలి వెల్లడి
ప్రపంచంలోనే బాగా అభివృద్ధి చెందిన దేశాలు వాస్తవానికి తమ ప్రజలందరికీ సురక్షితమైన తాగునీరు, శానిటేషన్‌ సదుపాయాలు కల్పించాలి. అయితే మైనారిటీ ప్రజలకు, నిరుపేదలకు వాటిని అందించడంలో అత్యంత అభివృద్ధి చెందిన అమెరికా, జపాన్‌, స్లోవేనియాలు ఎంతగానో వెనుకబడి ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి నిపుణురాలు శనివారం వెల్లడించారు. 'కాలిఫోర్నియాలోని శాక్రిమోంటోలో ఏదైతే చూశానో దానికి నేను ఎంతగానో విభ్రాంతి చెందాను. అక్కడ పబ్లిక్‌ రెస్ట్‌రూములను మూసివేయడం లేదా తెరిచి ఉండే సమయాన్ని పరిమితం చేయాలని ఆ నగరం నిర్ణయించింది. దాంతో నిలువ నీడలేని అభాగ్యులు తమ శానిటేషన్‌ హక్కును ఉపయోగించుకునేందుకు ప్రత్యామ్నాయాలు చూసుకోవాల్సి వస్తోంది' అని సురక్షిత మంచినీరు, శానిటేషన్‌కు సంబంధించిన మానవహక్కులపై ఐరాస ప్రత్యేక దూత కేటరినీ డీ అల్బూక్వెర్క్‌ ఈ సంవత్సరం ప్రారంభంలో తన అమెరికా పర్యటనపై విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నారు. 'బహిరంగ మూత్ర విసర్జన, మల విసర్జనను నేరంగా పరిగణిస్తున్నారు. దీంతో జరిగేదేంటంటే ఎవరైనా తమ భౌతిక అవసరాలు తీర్చుకునేందుకు స్థలం లేకపోవడాన్ని నేరంగా పరిగణించవచ్చు' అని పేర్కొన్నారు. ఇదే రకమైన వివక్ష జపాన్‌లో కొరియా మైనారిటీపైనా, స్లోవేనియాలో రోమా మైనారిటీపైనా సాగుతున్నట్లు ఆమె ఎత్తి చూపారు. అమెరికాలో నివసిస్తున్న ప్రజలందరూ దాదాపుగా సార్వజనీనంగా సురక్షిత నీటిని అనుభవిస్తున్నారని, అయితే మౌలిక వసతుల రంగానికి ఏటా 400 నుంచి 600 డాలర్ల మేరకు నిధుల కొరత ఉంటున్నందున 21వ శతాబ్దంలో ఆ దేశం ఈ వ్యవస్థను ఇదే విధంగా కొనసాగించగలుగుతుందా అనే ప్రశ్న తలెత్తుతోందని అన్నారు.

ఈ విధానాలు పేద వర్గాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. వాతావరణ మార్పు, కొరత ఉన్న వనరులకు డిమాండ్‌ పెరగడంతో రానున్న సంవత్సరాల్లో అమెరికాలో ఈ వివక్ష సమస్య మంచినీరు, శానిటేషన్‌కు సంబంధించి తీవ్రతరం కావచ్చని ఆమె తెలిపారు. ఈ సమస్యపై అంతర్జాతీయ ఒప్పందాలను ఆమోదించాల్సిందిగా అమెరికా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎలాంటి వివక్షా లేకుండా సురక్షితమైన నీరు, శానిటేషన్‌ హక్కును అందరికీ గ్యారంటీ ఇచ్చే సమగ్ర ఫెడరల్‌ చట్టాన్ని ఆమోదించాల్సిందిగా ఆమె కోరారు. ఇళ్ళులేని ప్రజలకు సురక్షిత నీరు, శానిటేషన్‌ను అన్ని మున్సిపాలిటీలూ అందించేలా హామీనివ్వాలని పేర్కొన్నారు. జపాన్‌కు సంబంధించి తెలుపుతూ అత్యధిక జనాభాకు సురక్షిత నీరు, శానిటేషన్‌ అందుబాటులో ఉండేలా చూస్తున్నందుకు అల్బూక్వెర్క్‌ ప్రశంసించారు. అయితే మైనారిటీ గ్రూపులు లేదా ఇతరత్రా పేద ప్రజల అవసరాల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరమున్నట్లు ఆమె తెలిపారు. ఇళ్ళు లేనివారు, మైనారిటీలు, వికలాంగులైన వ్యక్తుల పట్ల వివక్షను తొలగించేందుకు ఒక సమగ్ర చట్టాన్ని ఆమోదించాలని ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆమె క్యోటోలోని ఓ 90 ఏళ్ళ మహిళ ఉదంతాన్ని ఇక్కడ పేర్కొన్నారు. 'ఆమెకు మురుగునీటి వ్యవస్థ లేదు. ఆమె ఇంటికి గొట్టాల ద్వారా నీరు వచ్చే వసతి లేనందున బావి నుంచే నీరు తెచ్చుకోవలసి వస్తోంది. ఇలా ఎందుకు జరిగింది' అని ఆమె ప్రశ్నించారు. ఆమె కొరియా మైనారిటీ గ్రూపుకు చెంది ఉండటమే అందుకు కారణమని చెప్పారు. వారు నివసిస్తున్న స్థలానికి సంబంధించి న్యాయపరమైన వివాదం ఉండటం కూడా ఈ వివక్షకు కారణమని పేర్కొన్నారు. చుట్టూ ఉన్న మిగతా తెగలన్నింటికీ జపాన్‌లో సాధారణంగా అందుబాటులో ఉన్న విధంగా మంచినీరు, మురుగునీటి వ్యవస్థ అందుబాటులో ఉంది. న్యాయపరమైన వివాదం ఉన్నందున ఈ చిన్న గ్రూపుకు వాటి అందుబాటు లేదని ఆమె చెప్పారు.

స్లోవేనియాలో కూడా ప్రభుత్వం పెద్ద సంఖ్యలో జనాభాకు మంచినీరు, శానిటేషన్‌కు సంబంధించిన మానవహక్కుల బాధ్యతను నిర్వహిస్తోందని తెలిపారు. అయితే అన్ని రోమా తెగల వారికి మాత్రం ఈ హక్కులు అందకపోవడం పట్ల ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. తన కుమార్తె బడికి వెళ్ళనని మొరాయిస్తోందని ఒక వ్యక్తి కన్నీటితో ఆమెకు తెలిపారు. మిగతా పిల్లలు ఆమె దగ్గర వాసన వస్తోందని ఏడ్పించడం వల్ల ఆమె మొండికేస్తున్నట్లు చెప్పారు. 'ఆమె వద్ద వాసన వస్తోందని నాకు తెలుసు. కానీ మాకు నీరు అందుబాటులో లేవు' అని ఆ ఆ వ్యక్తి ఆమెకు తెలిపారు. అయితే ఏం చేస్తావని ప్రశ్నించగా, తన కూతుర్ని పట్టుకుని ఏడవడం మినహా తనకు వేరేమార్గం లేదని ఆయన జవాబిచ్చారని ఆమె చెప్పారు. 'మానవ హక్కులకు సంబంధించి ఎలాంటి వివక్షా లేకుండా అందరికీ సురక్షితమైన నీరు, శానిటేషన్‌ అందుబాటులో, ఆమోదయోగ్యమైన పద్ధతిలో ఉండాలి. ఈ ప్రాథమిక హక్కులు గ్యారంటీ ఇచ్చేందుకు ప్రభుత్వాలు నిరంతరం చర్యలు తీసుకోవాలి' అని ఆమె తన నివేదికను ముగించారు.

పోగుబడుతున్న సంపద- ఊహకందని విలాసాలు

దేశంలో 70% భారతీయులకు  రోజుకు రూ.20  ఆదాయం కూడా లేదు. 20 శాతం మంది భారతీయులు కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా తిరుగుతారు. 40 కోట్ల మంది ప్రజలకు కనీసం మరుగుదొడ్డి సౌకర్యం కూడా లేదు.46 శాతం మంది పిల్లలు పోషకాహారం లోపంతో బాధ పడుతున్నారు.56 శాతం మంది యిళ్ళకు విద్యుత్ సౌకర్యం లేదు.25 మంది పట్టాన వాసులు మురికి వాడల్లో కనీస అవసరాలకు కూడా నోచుకోలేకున్నారు. రోజుకు  2 ,191  మంది రైతులు వ్యవసాయాన్ని వదిలి కూలి పనులకు వలసేల్లుతున్నారు.  రోజుకు 2500 మంది పిల్లలు పౌష్టికాహారం లేక చనిపోతున్నారు. ప్రతి గంటకు ఇద్దరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు..      

    ఓ పెన్ను ఖరీదు రు.1.36 కోట్లు. అక్షరాలా ఒక కోటి ముప్ఫైలక్షలు. అవును నిజంగా ఇది పెన్ను ఖరీదే. నేడు ఇలాంటి పెన్నులు భారత దేశంలో అధిక సంఖ్యలో అమ్ముడవుతున్నాయి. ఇది మన దేశంలో అత్యధిక ఖరీదు కలిగిన పెన్ను. ఇవి కాకుండా అనేక విదేశీ లగ్జరీ బ్రాండుల పెన్నులు విస్తారంగా చెలామణీ లోకి వచ్చాయి. వీటి ధర రు.10 వేలు, 20 వేలు ఉంటుంది. వాటిలో ఉపయోగించే ఇంకు బాటిల్‌ ఖరీదే రు.12,00 ఉంటుందంటే వాటి సంగతి వూహించుకోవచ్చు. పెన్నులే ఏమిటి రు. 40 వేల విలువైన పాదరక్షలు, లక్ష రూపాయల లేడీస్‌ హ్యాండ్‌ బ్యాగులు. లక్షల ఖరీదు చేసే కళ్లజోళ్లు. వాచీలు. ఐదు, పది కోట్ల అతి విలాసవంతమైన కార్లు. ఇలాంటివే ఎన్నెన్నో. వీటన్నింటికీ ఈ కాలంలో గిరాకీ బాగా పెరిగిపోతున్నది. ఇవి విలాస వినియోగ వస్తువులు. అసలు వినియోగ స్వభావమే లేని అలంకరణ సామగ్రికి ఇంతకు మరెన్నో రెట్లు వెచ్చించి సంపన్నులు కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి వాటిలో ప్రధాన పాత్ర పెయింటింగ్‌లదే. గత కొన్నేళ్లుగా ఆర్ట్‌ మార్కెట్‌ ప్రపంచ వ్యాపితంగానే వూపనం దుకున్నది. ఒక్కో పెయింటింగ్‌ ఐదారు కోట్ల విలువ చేస్తుంది. ఇది భారత దేశంలో. ప్రపంచ మార్కెట్‌లో అయితే పదుల కోట్ల ఖరీదు చేసే కళా ఖండాలు అమ్ముడవు తున్నాయి. ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత ఆర్ట్‌మార్కెట్‌ మందగించినా, కొందరు ప్రముఖ చిత్రకారుల చిత్రాలకు, లాభాల బాటలో పయనించే కార్పొరేట్‌ సంస్థల నుండి గిరాకీ తరగడం లేదు.

అయినా భారత్‌ నేడు విలాస వినియోగంలో ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. 2009-10లో అగ్రరాజ్యమైన అమెరికా రు.2.7 లక్షల కోట్ల విలాస వినియోగంతో మొదటి స్థానంలో నిలవగా ఆ తర్వాత రెండవ స్థానం చైనాది. ఈ దేశంలో విలాస వినియోగం రు.39,600 కోట్లు. భారత దేశంలో మాత్రం కేవలం రు.6000 కోట్లు. భారత దేశంలో ఇప్పుడు తక్కువగా ఉన్నట్లు అనిపించినా విలాస వినియోగం ఏడాదికి 25 శాతం చొప్పున పెరిగి 2015 నాటికి రు.1.5 లక్షల కోట్లకు చేరుతుందని ఎర్న్‌స్ట్‌ అండ్‌ యంగ్‌ అనే సంస్థ అంచనా వేస్తున్నది. ఉదాహరణకు ఢిల్లీ కేంద్రంగా వ్యాపారం నిర్వహిస్తున్న బ్లూక్లాతింగ్‌ కంపెనీ అతి ఖరీదైన కోర్నెలియాని, కాడిని అండ్‌ వెర్సేస్‌ విదేశీ బ్రాండ్ల వస్త్రాలను విక్రయిస్తుంది. అలాంటి సంస్థ 2010లో రు.100 కోట్లు వెచ్చించి ముంబాయి, బెంగుళూరు, హైదరాబాదు తదితర నగరాలలో దేశవ్యాపితంగా 25 కొత్త స్టోర్లు ప్రారంభించడానికి సిద్ధం అయింది. ఇది భారత్‌లో పెరుగుతున్న విలాస వినియోగానికి ఒక చిహ్నం. అలాగే అనేక కంపెనీలు అతి సంపన్నులు లక్ష్యంగా తమ వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు పథకాలు రచించుకుంటున్నాయి.

ఇలా అతి విలాస వినియోగంలో ప్రపంచంలోనే భారత్‌ ప్రముఖ స్థానం ఆక్రమించడానికి కారణం తేలిగ్గానే అర్ధం చేసుకోవచ్చు. గత దశాబ్దన్నర కాలంగా దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలు అనుసరించబడుతున్నాయి. అంతకు ముందు అనుసరించింది కూడ పెట్టుబడిదారీ విధానమే అయినప్పటికీ, సరళీకృత విధానాలు అవధులు లేని రీతిలో ప్రైవేటు సంపదను అధికం చేశాయి. ఓ వైపున సంపద పెరుగుతుంటే అది అతి కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కావడం అనే ప్రక్రియ ఈ కాలంలో మరింత తీవ్రమైంది. మరో వైపున సంపన్నులకు పేద సాధారణ జనానికి మధ్య అగాథం అంతులేనంతగా పెరిగిపోతున్నది. దీనికి సంబంధించి లెక్కలు ప్రతి సంవత్సరం వెలువడుతూనే ఉన్నాయి. ఏడాదికేడాదికి ఈ క్రమం ప్రగాఢం కావడం తప్ప సడలే ధోరణే కనిపించడం లేదు.

తాజాగా ప్రసిద్ధ అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల పత్రిక ఫోర్బ్స్‌ 2010 సంవత్సరానికి భారత బిలియనీర్ల జాబితాను విడుదల చేసింది. వంద కోట్ల డాలర్లు అంతకు మించి ఆస్తులు కలిగిన వారిని ఈ జాబితాలో చేరుస్తారు. ఈ ఏడాది భారత దేశంలో వందకోట్ల డాలర్లు అంటే రు.4800 కోట్ల వ్యక్తిగత సంపద కలిగిన వారు 69 మంది తేలారు. గత ఏడాది ఇలాంటి వారి సంఖ్య 52. అంటే ఈ ఒక్క సంవత్సరంలోనే 17 మంది పెరిగారు. మొట్టమొదటి స్థానాన్ని రిలయన్స్‌ ఇండిస్టీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ దక్కించుకున్నారు. ఆయన వద్ద ఉన్న షేర్ల నికర విలువ 2,700 కోట్ల డాలర్లు. లండన్‌ కేంద్రంగా చేసుకుని కార్యకలాపాలు నిర్వహిస్తున్న లక్ష్మి మిట్టల్‌ 26.1 బిలియన్‌ డాలర్లతో రెండవ స్థానంలో నిలిచారు. తృతీయ స్థానంలో 17.6 బిలియన్‌ డాలర్ల సంపదతో విప్రో అధినేత అజీజ్‌ ప్రేమ్‌జీ ఉన్నారు. అలా వరుసగా శశిరుయా, రవి రుయా, సావిత్రి జిందాల్‌, అనిల్‌ అంబానీ, గౌతమ్‌ అదానీ, కుశాల్‌ పాల్‌ సింగ్‌, సునీల్‌ మిట్టల్‌, కుమార్‌ బిర్లా ఉన్నారు.పేద, ధనిక తారతమ్యం అధికం కావడమే కాదు సంపన్నుల్లో సైతం సంపద కేంద్రీకరణ ఈ కాలంలో మరింత తీవ్రమైంది. ఇది అమెరికా, చైనాలలో కన్నా అధికంగా ఉంది. భారత దేశంలో అతి సంపన్నులైన 100 మంది సంపదలో పై 10మంది వద్ద 50 శాతం కేంద్రీకృతమయింది. ఇదే చైనాలో వంద మంది సంపదలో పై పది మంది వద్ద 38 శాతం ఉంటే, అమెరికాలో 32 శాతం ఉంది. ప్రపంచంలోనే చైనా తర్వాత రెండవ అతి వేగంగా అభివృద్ధి చెందే దేశంగా భారత్‌ పేరుగాంచింది.

అమెరికాలో మొదలై మొత్తం ప్రపంచాన్ని చుట్టబెట్టిన ఆర్ధిక సంక్షోభం ప్రభావానికి అతి స్వల్పంగా గురయిన భారత్‌ అభివృద్ధి వేగాన్ని కొనసాగిస్తున్నది. కాని ఈ అభివృద్ధి మాత్రం అతి కొద్దిమందికే పరిమితమవుతున్నది. సరళీకృత ఆర్ధిక విధానాలు మొదలయిన తొలిరోజుల్లో వాటివల్ల అత్యధికంగా లాభపడేది మధ్యతరగతి వర్గం అని ప్రచారం జరిగింది. కనీసం 20 కోట్ల మంది మధ్యతరగతి ప్రజానీకం స్థితిగతులు బాగా మెరుగవుతాయని భావించారు. వీరు ఒక దేశం జనాభాతో సమానంగా ఉంటారని, ఇలాంటి వారి అభిరుచులకు తగిన విధంగా ఎన్నో వినియోగ వస్తువులు తయారు చేసి విక్రయించుకోవచ్చని అనేక సంస్థలు ప్రణాళికలు కూడా వేసుకున్నాయి. కాని ఇప్పుడు అలాంటి వారి కన్నా అతి సంపన్నుల మార్కెట్‌ మాత్రమే పెరిగే పరిస్థితి ఏర్పడింది.ఇదే సమయంలో నిరుపేదల సంఖ్య ఈ కాలంలో విపరీతంగా పెరిగిపోతున్నది. భారత దేశంలో కుబేరుల జాబితాను విడుదల చేసిన ఫోర్బ్స్‌ పత్రికే ఈ దేశంలో ఒక వైపున 59 మంది శతకోటీశ్వరులు ఏర్పడగా, 40 శాతం మంది దారిద్య్రంలోనే మగ్గుతున్నారని పేర్కొంది. ఇటీవలనే ఐక్య రాజ్యసమితి సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల సాధన సమీక్షలో భారత దేశానికి సంబంధించి వెల్లడించిన వివరాలు ఈ అంశాన్ని మరింత స్పష్టం చేస్తున్నాయి. దేశంలో పేదల శాతం 27 నుండి 37 శాతం వరకు ఉన్నట్లు రకరకాల అధికారిక అధ్యయనాలు తెలుపుతున్నాయి.

మూడేళ్ల లోపు బాలల్లో 53.5 శాతం మంది పౌష్టికాహార లోపానికి గురవుతున్నారు. 2007 తర్వాత దేశంలో కొత్తగా 3.36 కోట్ల మంది దారిద్య్రంలోకి నెట్టివేయబడ్డారు. ఒక్క 2009లోనే 1.36 కోట్లమంది దారిద్య్ర రేఖ దిగువకు చేరుకున్నారు. మరొక అంచనా ప్రకారం 2 డాలర్లకన్నా దినసరి సగటు ఆదాయం లభించే వారు దేశ జనాభాలో 77 శాతం మంది ఉన్నారంటే పరిస్థితిని తేలిగ్గానే వూహించుకోవచ్చు. వాస్తవం ఇది కాబట్టే ఒక వైపున అతి సంపన్నులు విలాసం కోసం వాడే వస్తువులు గిరాకీ పెరిగి పోతున్నది. విదేశీ కంపెనీలు ఇలాంటి మార్కెట్‌ కోసం ఎగబడుతున్నాయి. మరో వైపున పేద, సాధారణ, మధ్యతరగతి వారికి అవసరమయ్యే వినియోగ సరకులు, ఇతర సామగ్రి గిరాకి తగినంతగా పెరగక పోవడంతో వాటి ఉత్పత్తి, ఉపాధి కల్పన కూడ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది.---గుడిపూడి విజయరావు   Thu, 7 Oct 2010, IST